TRS: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య.. హైదరాబాద్‌లో కలకలం

  • టీఆర్ఎస్ కార్యాలయంలోనే ఆత్మహత్య
  • కేసీఆర్ సీఎం కావాలని, వివేక్ మంత్రి కావాలని లేఖ
  • తనను క్షమించాలని వేడుకోలు

హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఈసారి మంత్రి కావాలని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ కార్యకర్త గురవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజాంపేటలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గురవప్ప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. తనను క్షమించాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, వివేక్ మంత్రి కావాలని అందులో రాసుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు తాను జైలుకు వెళ్లానని పేర్కొన్నాడు. 8 సార్లు జైలుకు వెళ్లానని, లాఠీ దెబ్బలు తిన్నానని లేఖలో పేర్కొన్నాడు. నాడు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ప్రాణాలు తీసుకున్నాడని, అప్పట్లో తాను కూడా ఆత్మహత్యకు పాల్పడితే పోలీసులు కాపాడారని తెలిపాడు.

తనకు ఇల్లు లేదని, తన భార్యాపిల్లలను ఆదుకోవాలని, వారికి అన్యాయం చేయొద్దని కోరాడు. కాగా, గురవప్ప ఆత్మహత్యపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి పాదాలు నేలకు తాకుతున్నాయని, కాబట్టి అది ఆత్మహత్య కాదని వాదిస్తున్నారు. గురవప్ప ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News