అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణమాఫీ.. ఆ సొమ్ము ఎక్కడి నుంచి తెస్తామో తెలుసా?: చత్తీస్‌గఢ్‌లో రాహుల్ గాంధీ

18-11-2018 Sun 07:50
  • విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ముక్కు పిండి డబ్బులు తీసుకొస్తాం
  • మోదీ రుణాల మాఫీలో ఒక్క రైతూ లేడు
  • నోట్ల రద్దుతో పేదలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా?
తుది విడత ఎన్నికలకు సిద్ధమవుతున్న చత్తీస్‌గఢ్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతులపై వరాలు జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే కేవలం పది రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి నుంచి డబ్బులు వసూలు చేసి ఆ సొమ్ముతో రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు.

నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీపై మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్.. మోదీ నోట్ల రద్దు వల్ల పేదలు, నిజాయతీపరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ధనవంతులు మాత్రం దర్జాగా ఉన్నారన్నారు.  కొరియా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ రూ. 3.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, అవన్నీ ధనవంతులవేనని ఆరోపించారు. వారిలో ఒక్క రైతు కూడా లేడన్నారు.

‘‘కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే.. మీరు పది రోజులు కూడా వేచి చూడాల్సిన పనిలేదు. చత్తీస్‌గఢ్‌లోని రైతుల రుణాలను మాఫీ చేస్తాం’’ అని పేర్కొన్నారు. రుణమాఫీకి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ప్రశ్నించారని పేర్కొన్న రాహుల్.. ‘‘మోదీజీ,  చత్తీస్‌గఢ్‌లో చేసే రుణమాఫీకి డబ్బులు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, అనిల్ అంబానీల నుంచి తీసుకొస్తాం. వారి ముక్కుపిండి మరీ వసూలు చేసి రుణమాఫీ చేస్తాం’’ అని వివరించారు.

విజయ్ మాల్యా బ్యాంకులకు రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టి వెళ్లిపోయారని, నీరవ్ మోదీ ఏకంగా రూ. 35 వేల కోట్లు దోచుకున్నాడని రాహుల్ ఆరోపించారు. ఆ సొమ్మును రాబట్టి రైతు రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ వివరించారు.