Chandrababu: ముఖ్యమంత్రిగా ఉండి గడ్డిపీకుతున్నావా?: చంద్రబాబుపై జగన్ ఫైర్

  • రాష్ట్రం కరవు కాటకాలతో అల్లాడుతోంది
  • 7 జిల్లాల పరిస్థితి అత్యంత దారుణం
  • కరవొచ్చిందంటే ప్రభుత్వం వైపు చూస్తారు
  • వడ్డీ మినహాయింపు కూడా జరగలేదు

కరవుతో అల్లాడుతున్న రైతులకు తీసుకున్న రుణాలపై కనీసం వడ్డీ మినహాయింపు కూడా జరగలేదని... ఇలాంటపుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం గడ్డిపీకుతున్నాడంటూ జగన్ మండిపడ్డారు. నేడు పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడుగారి పాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రం మొత్తం కరవు కాటకాలతో అల్లాడుతోంది. 33.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గుంటూరు నుంచి అనంతపురం వరకూ 7 జిల్లాల పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా కనిపిస్తోంది. దక్షిణ కోస్తా ప్రాంతం కృష్ణా నుంచి నెల్లూరు దాకా -46 శాతం, రాయలసీమంతా -50 శాతం, విజయనగరం జిల్లాలో 26 కరవు మండలాలు.

రాష్ట్రం మొత్తం మీద 507 మండలాలు తీవ్ర కరవుతో అల్లాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయంనగరం జిల్లాలో 4 మాత్రమే కరవు మండలాలుగా చంద్రబాబునాయుడు గారు చెబుతారు. రాష్ట్రంలో 328 మాత్రమే కరవు మండలాలని చెబుతున్నారు. ఓవైపు కరవు మండలాల లెక్కలు తగ్గించి చంద్రబాబు చెబుతుంటే.. మరోవైపు ఆశ్చర్యకరంగా ఖరీఫ్‌లో కరవు కారణంగా రైతులు నష్టపోయారని ఇన్‌పుట్ సబ్సిడీ కింద రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని లెక్కలు తేల్చారు.

ఇప్పటికి ఖరీఫ్ అయిపోయింది. రబీ కూడా సగం అయిపోయింది. రూ.2000 కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రజలకు ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నా. ఎక్కడైనా సరే.. కరవొచ్చిందంటే ప్రజలు ప్రభుత్వం వైపు చూస్తారు. కానీ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రైతుల రుణాలు రీషెడ్యూల్ కాలేదు. రైతన్నలు తీసుకున్న రుణాలపై కనీసం వడ్డీ మినహాయింపు కూడా జరగలేదు. ఇలాంటపుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గడ్డిపీకుతున్నావయ్యా చంద్రబాబు? అని అడుగుతున్నా’’ అని జగన్ ధ్వజమెత్తారు.

More Telugu News