Telangana: మాటల్లోనే కాదు చేతల్లోనూ కేసీఆర్ లౌకికవాదే.. ఆయనకు మరోసారి ఛాన్స్ ఇవ్వండి!: కేటీఆర్

  • పేదలకు షాదీ ముబారక్ తెచ్చాం
  • మరిన్ని సంక్షేమ పథకాలు చేపడతాం
  • ముస్లిం ఆత్మీయ సభలో కేటీఆర్ వెల్లడి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ లౌకికవాదేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతస్తులు అన్న తేడా లేకుండా అన్నివర్గాలను కుటుంబ సభ్యుల్లా కేసీఆర్ ఆదుకున్నారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన టీఆర్ఎస్ ముస్లిం ఆత్మీయ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

రాష్ట్రంలోని పేద ముస్లింలతో పాటు ఇతర బడుగు బలహీనవర్గాల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలుచేసే ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు. నిరుపేద ముస్లిం యువతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. హైదరాబాదీలు ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నారనీ, తమ ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదని కేటీఆర్ గుర్తుచేశారు.

అందరిని కలుపుకుని వెళ్లినప్పుడే అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ విశ్వసిస్తారనీ, గత 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం దాన్నే పాటిస్తున్నారని వెల్లడించారు. తాము ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీకి మరోసారి పట్టం కట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు టీఆర్ఎస్ మైనారిటీ సెల్ నేతలు పాల్గొన్నారు.

More Telugu News