Hyderabad: డబ్బులు ఇవ్వలేదని పేకాటాడుతున్న యువకులపై కత్తులతో దాడి...ఒకరి మృతి

  • కాటేదాన్‌ ఏరియాలో షానూర్‌ గ్యాంగ్‌ బీభత్సం
  • మహ్మద్‌ షానూర్‌ పాత నేరస్తుడు
  • ఇతనిపై పలు హత్య, చోరీ కేసులు

పారిశ్రామిక ప్రాంతమైన హైదరాబాద్‌ కాటేదాన్‌ ఏరియాలో ఓ రౌడీషీటర్‌ గ్యాంగ్‌ కత్తులు, కర్రలతో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. డబ్బులు డిమాండ్‌ చేస్తే ఇవ్వలేదన్న కోపంతో పేకాటాడుతున్న యువకులతోపాటు, ఇదేమిటని ప్రశ్నించిన యువకుడిపైనా దాడికి పాల్పడ్డారు.

శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. కాలాపత్తర్‌ నివాసితుడైన మహ్మద్‌ షానూర్‌ ఘాజీ అలియాస్‌ ఇర్ఫాన్‌ అలియాస్‌ మహ్మద్‌ షానూర్‌ (20) రౌడీషీటర్‌. ఇతనిపై పలు చోరీలు, హత్య కేసులున్నాయి. కొందరు వ్యక్తులతో ఓ గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతుంటాడు.

గురువారం రాత్రి అన్సారీ రోడ్డులో కొందరు యువకులు పేకాటాడుతున్నారు. అక్కడికి వచ్చిన షానూర్‌ గ్యాంగ్‌ పేకాటాడుతున్న వారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డబ్బు ఇచ్చేందుకు ఆ యువకులు నిరాకరించారు. దీంతో వారిపై కత్తులు, కర్రలతో దాడికి దిగారు. భయంతో యువకులు పరుగు తీయగా వారి వెంటపడ్డారు. ఆన్సారీ రోడ్డులో ఉండే మహ్మద్‌ ముస్తాక్‌ (20) గ్యాంగ్‌ సభ్యులను అడ్డుకుని ఇదేమిటని ప్రశ్నించాడు. గ్యాంగ్‌ సభ్యుల చేతుల్లో కత్తులు, కర్రలు ఉండడంతో తన సెల్‌ ఫోన్‌లో వాటితో పాటు గ్యాంగ్‌ సభ్యులను చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

దీనిపై ఆగ్రహించిన షానూర్‌ గ్యాంగ్‌ సభ్యులు ముస్తాక్‌పై కత్తులతో దాడిచేశారు. అనంతరం పారిపోతున్న యువకులను సైతం వెంబడించి దాడికి పాల్పడ్డారు. షానూర్‌ గ్యాంగ్‌ సభ్యుల దాడిలో తీవ్రంగా గాయపడిన ముస్తాక్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. ఈ ఘటనలో సాహిన్‌, అర్బాజ్‌, సిరాజ్‌లు తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధ్యులైన షానూర్‌తోపాటు అతని గ్యాంగ్‌లోని పహిల్వాన్‌ అలియాస్‌ పర్హాన్‌ (22), అబ్దుల్‌ ఆల్తాఫ్‌ (19), మహ్మద్‌ అర్బాజ్‌ను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులందరిపైనా పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

More Telugu News