Andhra Pradesh: మోదీ చేతిలో సీబీఐ ఉంటే చాలా డేంజర్.. ఆయన్ను 2019లో ఓడించాలి!: యనమల

  • సమ్మతి ఉత్తర్వులను రద్దుచేయడం సబబే
  • మిగతా రాష్ట్రాలు కూడా ఇదే చేయాలి
  • శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమే

దేశంలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను రద్దు చేశామని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రస్తుతం సీబీఐలో అంతర్గత సంక్షోభం నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకే సమ్మతి ఉత్తర్వులను జీవో ద్వారా రద్దు చేశామని సమర్థించుకున్నారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మిగతా రాష్ట్రాలు సైతం సీబీఐకి సమ్మతి ఉత్తర్వులను రద్దు చేయాలని యనమల పిలుపునిచ్చారు. సీబీఐని ప్రధాని నరేంద్ర మోదీనే సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ప్రస్తుతం భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) స్వతంత్రతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమనీ,  ఆయా ప్రభుత్వాల అనుమతి తీసుకున్నాకే కేంద్ర బలగాలు రాష్ట్రాల్లో అడుగుపెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకు బీజేపీ యత్నిస్తోందని యనమల తెలిపారు. సీబీఐ వంటి సంస్థలు మోదీ చేతిలో ఉంటే మరింత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీని గద్దె దించడంతో పాటు 2019లో ఆయన్ను అధికారంలోకి రాకుండా చేయడం ప్రతిఒక్కరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు.

More Telugu News