కూకట్ పల్లిలో నన్ను గెలిపించండి.. నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తా!: నందమూరి సుహాసిని

17-11-2018 Sat 10:50
  • తాత, నాన్న, బాబాయ్ ఆశీస్సులతో పోటీ
  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
  • ఈ రోజు ఉదయం 11.21 గంటలకు ముహూర్తం

స్వర్గీయ ఎన్టీఆర్, నాన్న హరికృష్ణ, చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ ఆశీస్సులతో తాను కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నందమూరి సుహాసిని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఘాట్ ను ఈ రోజు సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం సుహాసిని మీడియాతో మాట్లాడారు.

ఈ రోజు ఉదయం 11.21 గంటలకు తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సుహాసిని తెలిపారు. మరోవైపు హరికృష్ణ సోదరి లోకేశ్వరి మాట్లాడుతూ.. హరికృష్ణలాగే సుహాసినిది కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వమని చెప్పారు. కూకట్ పల్లి ప్రజలు నిండు మనసుతో తన సోదరిని ఆశీర్వదించాలని కోరారు.

తమ్ముడు బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా నామినేషన్ సందర్భంగా తాను వెళ్లడం బాగా కలిసివచ్చి విజయం సాధించారని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు సుహాసిని నామినేషన్ సందర్భంగా తాను మరోసారి వచ్చాననీ, ఈసారి సుహాసిని కూడా ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.