Andhra Pradesh: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

  • ఎన్నిసార్లు చెప్పినా తీరు మారలేదు
  • పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు
  • పద్ధతిగా పనిచేస్తేనే భవిష్యత్ ఉంటుంది

టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అనుచరులు పెదవేగి మాజీ సర్పంచ్, టీడీపీ నేత సాంబశివ కృష్ణారావుపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా చింతమనేని తీరు మారడం లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. చింతమనేని వ్యవహారశైలిపై పలువురు టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఆయన ఈ మేరకు స్పందించారు.

టీడీపీకి చెడ్డపేరు తెచ్చేలా చింతమనేని వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్కరు చేసే తప్పుతో పార్టీ మొత్తం తలదించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో, పార్టీలో కేవలం పనిచేస్తే సరిపోదనీ, పద్ధతిగా ఉంటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. తన సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించబోనని చంద్రబాబు హెచ్చరించారు.

వంగూరు-లక్ష్మీపురం మధ్య కొందరు పోలవరం కుడికాలువ గట్టు మట్టిని నిన్న అక్రమంగా తవ్వడాన్ని గమనించిన సాంబశివ కృష్ణారావు ఏఈకి సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకునేలోపే చింతమనేని అనుచరుడు గద్దె కిశోర్ సహా మరికొందరు సాంబశివ కృష్ణారావును కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఈ వ్యవహారంపై బాధితుడు నిన్న పోలీసులను ఆశ్రయించాడు. 

More Telugu News