West Godavari District: సొంత పార్టీ వారైనా ఎమ్మెల్యే చింతమనేని తీరు అదే... టీడీపీ నేతపై దాడి.. క్షమాపణ!

  • పెదపాడు మండలం దాసరిగూడెం తాజా మాజీ సర్పంచ్‌పై చెయ్యి చేసుకున్న వైనం
  • ఆందోళనకు దిగిన గ్రామస్థులు...పార్టీ ఫ్లెక్సీల దహనం
  • క్షమాపణ చెప్పి పోలీసుల సాయంతో బయటపడిన ఎమ్మెల్యే

టీడీపీయేతర నాయకులు, కార్యకర్తలే అనుకున్నాం...సొంత పార్టీ వారైనా తన తీరు అదేనని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నిరూపించారు. టీడీపీ నాయకుడిపైనే ఏకంగా దాడికి దిగి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి పరిస్థితి ఎదురు తిరగడంతో గ్రామస్థులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... పెదపాడు మండలం దాసరిగూడెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి చింతమనేని హాజరయ్యారు. సభకు దాసరిగూడెం తాజా మాజీ సర్పంచ్‌ పామర్తి పెదరంగారావు కూడా హాజరయ్యారు. ఓ వ్యక్తికి ఉపాధి రుణం మంజూరు అంశం సభలో ప్రస్తావనకు వచ్చింది.

ఈ సందర్భంగా చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. ‘వాడికి రుణం మంజూరు చేయాలని నీకెవడు సిఫార్సు చేయమన్నాడు? గ్రామంలో నాకు తెలియకుండా పింఛన్లు ఎందుకు మంజూరు చేయిస్తున్నావ్‌?’ అంటూ అసభ్య పదజాలం అందుకున్నారు. రంగారావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోకుండా అతనిపై చెయ్యి చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రంగారావు వెంటనే అక్కడి నుంచి తన స్వగ్రామమైన వేంపాడు వెళ్లిపోయారు. విషయం గ్రామస్థులకు చెప్పడంతో వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు.

గ్రామంలో ఏర్పాటుచేసి ఉన్న పార్టీ ఫ్లెక్సీలను తగులబెట్టారు. కాసేపటికి గ్రామదర్శిని కార్యక్రమం ముగించుకుని వస్తున్న చింతమనేని వాహనాన్ని అడ్డుకున్నారు. క్షమాపణ చెబితేగాని కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. దీంతో చింతమనేని ఓ మెట్టు దిగి ‘రంగారావు నాకు తమ్ముడి లాంటివాడు, ఏదో ఆగ్రహంలో అలా చేశాను’ అని సంజాయిషీ ఇచ్చినా గ్రామస్థులు సంతృప్తి చెందలేదు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే, రంగారావుకు మూడు సార్లు క్షమాపణ చెప్పారు. ఈలోగా విషయం తెలుసుకుని గ్రామానికి వచ్చిన పోలీసుల సాయంతో ఊరి నుంచి బయటపడ్డారు.

More Telugu News