Chandrababu: చంద్రబాబు తన అవినీతి నుంచి బయటపడేందుకే సీబీఐపై ఆంక్షలు: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • ప్రైవేట్ కంపెనీలపై దాడులు జరిగితే బాబుపై జరిగినట్టా?
  • ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు
  • మొన్నటి వరకూ ఇచ్చిన అనుమతిని ఇప్పుడెందుకు ఉపసంహరించుకోవడం?

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఏపీలో అనుమతిని ఉపసంహరించుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలపై దాడులు జరిగితే, తనపై దాడి జరిగినట్టుగా చంద్రబాబు భావిస్తున్నారని, తన అవినీతి నుంచి బయటపడేందుకే సీబీఐపై ఆంక్షలు విధించారని ఆరోపించారు.

మూడు నెలల కిందట సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు ఏ విధంగా బెంబేలెత్తుతున్నారో చూస్తున్నామని అన్నారు. అవినీతిపరులకు కొమ్ముకాసేందుకు, అవినీతిని ప్రోత్సహించేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాలను ఆసరా చేసుకుని చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. దేశంలో అవినీతిని అంతం చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తుంటే, ఆ ప్రయత్నాలను చంద్రబాబు నీరు గారుస్తున్నారని జీవీఎల్ విమర్శించారు.  

More Telugu News