kodada: కోదాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి కేటీఆర్

  • కోదాడలో టీఆర్ఎస్ దెబ్బతినకూడదు
  • సొంత ఎజెండాలను పక్కన పెట్టి కలిసి పోరాడాలి
  • సీట్లు కూడా పంచుకోలేని అసమర్థత కాంగ్రెస్ ది  

నల్గొండ జిల్లా కోదాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీ-టీడీపీకి చెందిన కోదాడ నాయకుడు మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్లయ్యను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ, కోదాడ యువశక్తిని వెంటబెట్టుకుని వచ్చిన మల్లయ్య యాదవ్ కు స్వాగతమంటూ సంతోషం వ్యక్తం చేశారు. కోదాడలో టీఆర్ఎస్ దెబ్బతినకూడదంటే సొంత ఎజెండాలను పక్కన పెట్టాలని, కలిసి పోరాడితే ప్రత్యర్థి దిమ్మ తిరిగిపోవాల్సిందేనని, కలిసికట్టుగా కదం తొక్కితే కోదాడ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు తాళం వేసి బౌన్సర్లను కాపలా పెట్టే పరిస్థితి వచ్చిందని, 75 రోజుల్లో కనీసం సీట్లు కూడా పంచుకోలేకపోయారని విమర్శించారు. సీట్లు కూడా పంచుకోలేని అసమర్థులు పొరపాటున రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దమనిషి ఒకరు టికెట్ ఇవ్వాలంటే రూ.3 కోట్లు అడిగాడని, ఓయూ విద్యార్థికి టికెట్ ఇవ్వమంటే, ‘పైసలు ఎన్ని ఉన్నాయి?’ అని ఢిల్లీ నాయకులు అడిగారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు.

More Telugu News