Chandrababu: చిన్నప్పటి నుంచీ రాజకీయాలంటే ఇష్టమే.. నాపై నమ్మకం ఉంచినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు: నందమూరి సుహాసిని

  • మా తాత, తండ్రి, మామయ్య నాకు స్ఫూర్తి
  • ప్రజా సేవ చేయాలనే రాజకీయాల్లోకి వస్తున్నా
  • నామినేషన్ వేశాక అన్నీమాట్లాడతా

తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశమిచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘నా తెలంగాణ ప్రజలందరికీ మీ ఇంటి ఆడబిడ్డగా నా హృదయపూర్వక నమస్కారాలు. నా మీద నమ్మకం ఉంచిన పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబునాయుడుగారు.. నేను ప్రజలకు సేవ చేస్తానని నమ్మి కూకట్ పల్లి సీటు కేటాయించారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా తాతగారైన నందమూరి తారకరామారావు గారు ప్రజలకు సేవ చేయాలని తెలుగు దేశం పార్టీ స్థాపించారు. మా నాన్నగారైన నందమూరి హరికృష్ణ గారు రథసారథి అయి పార్టీకి సేవ చేశారు..’ అని అన్నారు.
 
 టీడీపీ ప్రజల పార్టీ

చిన్నప్పటి నుంచి తనకు రాజకీయాలంటే ఇష్టమని, తన తాత నందమూరి ఎన్టీ రామారావు, తండ్రి హరికృష్ణ, మామయ్య చంద్రబాబునాయుడు తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చారని సుహాసిని అన్నారు. తన మామ మాజీ ఎంపీ అని, ఆయన స్ఫూర్తి కూడా తనపై ఉందని ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తన తాతయ్య ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఇది ప్రజల పార్టీ అని అన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ప్రజల కోసం అనునిత్యం కష్టపడి పని చేస్తానని అన్నారు. అందరి ఆశీర్వాదాలు తనకు కావాలని, రేపు నామినేషన్ వేసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు.

సుహాసినిని అందరూ ఆశీర్వదించాలి:  నందమూరి రామకృష్ణ


అంతకుముందు, ఎన్టీఆర్ కుమారుడు, నందమూరి హరికృష్ణ సోదరుడు రామకృష్ణ మాట్లాడుతూ, తమకు చాలా ఆనందంగా ఉందని, కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగనున్న సుహాసినిని అందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి, పేద ప్రజలకు సేవ చేయడానికి టీడీపీని తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించారని అన్నారు.  

More Telugu News