Telangana: రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని విన్నాను!: టీఆర్ఎస్ నేత కవిత

  • ఉత్తమ్ తన భార్యకు టికెట్ ఇప్పించుకున్నారు
  • మమ్మల్ని కుంటుంబ పార్టీ అంటున్నారు
  • ‘జగిత్యాల’ను కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తాం

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కుటుంబ పార్టీగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించడంపై పార్లమెంటు సభ్యురాలు, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. అదే నిజమయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తన భార్యకు టికెట్ ఎందుకు ఇప్పించుకున్నారని ప్రశ్నించారు. కోదాడలో ఈ రోజు పర్యటించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజికవర్గానికి సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేత రేణుకా చౌదరి చెప్పడంపై కవిత ఆసక్తికర కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుక బయటకు వస్తున్నట్లు తాను విన్నానని అన్నారు. జగిత్యాల నియోజక వర్గాన్ని గెలిచి సీఎం కేసీఆర్ కు బహుమానంగా అందజేస్తామని పేర్కొన్నారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో మెజారిటీ సీట్లు టీఆర్ఎస్ వేనని కవిత స్పష్టం చేశారు.

More Telugu News