Andhra Pradesh: అభివృద్ధిలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది..రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలను పెంచబోం!: సీఎం చంద్రబాబు

  • సీమకు ముందుచూపుతో నీరు అందిస్తున్నాం
  • సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం
  • 30న రాజమండ్రిలో జయహో బీసీ సభ

ఆంధ్రప్రదేశ్ లో మిగతా ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందుచూపుతో రాయలసీమకు సాగు, తాగునీటిని అందిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామనీ, ప్రజల ఇబ్బందులను ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి ‘జయహో బీసీ’ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.

రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో ఈ నెల 30న జయహో బీసీ బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం ఓడీఎఫ్(బహిరంగ మలమూత్ర విసర్జన రహితం)గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచబోమనీ, విద్యుత్ ను ఆదాచేయడంతో పాటు ప్రత్యామ్నాయ ఉత్పత్తిపై దృష్టి సారిస్తామన్నారు. గత నాలుగేళ్లలో దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో 10.50 శాతం అభివృద్ధిని నమోదుచేశామన్నారు. విద్యుత్ ను సమర్థవంతంగా వాడుకునే బోర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విద్యుత్ ను డిస్కమ్ లకు అమ్ముకోవడం ద్వారా రైతుకు నెలకు మరో రూ.4-5 వేల చొప్పున అదనపు ఆదాయం వస్తుందన్నారు.

More Telugu News