Kodandaram: బరిలో పొన్నాల లేనట్టే... జనగామలో మొదలైన కోదండరామ్ ప్రచారం!

  • జనగామలో సిద్ధమైన ప్రచార రథాలు
  • టీజేఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం
  • ముఖ్యులను కలుస్తున్న కోదండరామ్ బంధుగణం

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు నిరాశే ఎదురైంది. జనగామ నుంచి మహాకూటమి తరఫున ఆయన టికెట్ ను ఆశించినప్పటికీ, పొత్తులో భాగంగా టీజేఎస్ కు ఆ స్థానాన్ని ఇవ్వడం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ విషయం స్పష్టం కాగానే, కోదండరామ్ అనుచరులు జనగామలో ప్రచార సందడిని ప్రారంభించారు. ఆయన కోసం ప్రచార రథాలు సిద్ధం అయ్యాయి. మొత్తం ఎనిమిది ప్రచార రథాలను టీజేఎస్ స్థానిక నేతలు సిద్ధం చేసి, ఈ ఉదయం నుంచి తిప్పుతున్నారు. జనగామలో టీజేఎస్ కార్యాలయం కూడా ఏర్పడింది.

ఈ రథాలపై "ప్రజా కూటమి బలపరిచిన తెలంగాణ జనసమితి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రొ. కొదండరామ్ గారిని గెలిపిద్దాం" అని రాసుంది. అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేయాలని చెబుతూ, ప్రగతికి పది సూత్రాలను కూడా వాహనంపై ఉంచారు. దీనిపై కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలతో పాటు ఎల్ రమణ, చాడ వెంకటరెడ్డి ఫోటోలు కూడా ఉన్నాయి.

ఇక ఎన్నికలు ముగిసేంత వరకూ కోదండరామ్, జనగామలోనే మకాం వేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కోదండరామ్ కు ఈ ప్రాంతంలో సమీప బంధువులు ఉండటంతో, వారంతా ముఖ్యులను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా, 19న ఆయన తన నామినేషన్ ను దాఖలు చేయవచ్చని తెలుస్తోంది. కోదండరామ్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

More Telugu News