Gaja: నాగపట్నం 'గజ' తుపాన్ బీభత్సం... తొలి దృశ్యాలు హృదయవిదారకం!

  • నాగపట్నం అతలాకుతలం
  • కారైకల్, పుదుక్కొట్టై కూడా
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

'గజ' తుపాను తమిళనాడులోని నాగపట్నాన్ని అతలాకుతలం చేసింది. గత అర్ధరాత్రి తీరాన్ని దాటుతున్న వేళ, కలిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విరిగి పడిన ఇళ్లు, తెగిపడిన కరెంటు తీగలు, కూలిన చెట్లు, ఎగిరిపోయిన పైకప్పులు, నిలువ నీడ లేకుండా వర్షంలో తడుస్తున్న పేదలు... నాగపట్నం ప్రాంతంలో ఇప్పుడు ఎటు చూసినా కనిపిస్తున్నవి ఇటువంటి హృదయ విదారక దృశ్యాలే.

నాగపట్నం రైల్వే స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది. భీకర గాలులకు, ప్లాట్ ఫామ్ లపై ఉన్న షెడ్లు ఎగిరిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థ ధ్వంసమైంది. ముందుజాగ్రత్త చర్యగా నిన్న సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేయగా, నాలుగు జిల్లాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఇక వందలాది కరెంటు స్తంభాలు కూలడంతో, వాటి పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాగపట్నంతో పాటు కడలూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కారైకల్, తిరువారూరు, పుదుక్కొట్టై తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతూ ఉంది. రహదారులపై చెట్లు విరిగిపడటంతో, రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. పుదుచ్చేరి, తంజావూరు, రామనాథపురం ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. నాగపట్నంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని, ప్రత్యేక ఎఫ్ఎం ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.








More Telugu News