KCR: సెలవు అడిగితే ఇవ్వలేదని ఐదు లక్షల వేతనాన్ని వదులుకుని వచ్చేశా: కేటీఆర్

  • ఉద్యమం కంటే ఉద్యోగం గొప్పది కాదనుకున్నా
  • కేసీఆర్‌కు చెప్పకుండానే రాజీనామా చేశా
  • ఆ ఎన్నికల్లో గెలుపు కోసం అహర్నిశలు శ్రమించా

అమెరికాలోని ఓ కంపెనీలో నెలకు ఐదు లక్షల రూపాయల వేతనంతో పనిచేస్తున్న తాను రాష్ట్రానికి ఎందుకు రావాల్సి వచ్చిందీ టీఆర్ఎస్ నేత కేటీఆర్ వివరించారు. ‘‘యూపీఏ ప్రభుత్వం నుంచి 2006లో బయటకు వచ్చిన కేసీఆర్ కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కనుక ఓడిపోతే తెలంగాణ సెంటిమెంట్ లేదని చెప్పేందుకు ప్రత్యర్థులు కాసుక్కూర్చున్నారు.

విషయం తెలియడంతో ఉప ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్‌ను గెలిపించి తీరాలని నిర్ణయించుకున్నా. నేను పనిచేస్తున్న ఇన్‌ఫ్రా కంపెనీ యాజమాన్యం వద్దకు వెళ్లి మూడు నెలలు సెలవు అడిగా. కుదరదన్నారు. దీంతో ఆలోచనలో పడ్డా. నెలకు రూ. 5 లక్షల వేతనం. అయినా సరే ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నా. కేసీఆర్‌కు చెప్పకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశా. జీవన్మరణ సమస్యగా మారిన ఆ ఎన్నికల్లో గెలుపు కోసం మూడు నెలలు అవిశ్రాంతంగా పనిచేశా’’ అని కేటీఆర్ వివరించారు. గురువారం హైదరాబాద్, సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

More Telugu News