Chandrababu: 'సీబీఐ' విషయంలో ఏమిటీ సాధారణ సమ్మతి?.. చంద్రబాబు ప్రభుత్వం దీనిని ఎలా ఉపయోగించుకుంది?

  • నమ్మకం కోల్పోతున్న సీబీఐ
  • రాజకీయ చక్రబంధంలో దర్యాప్తు సంస్థ
  • దానికంటే రాష్ట్ర సంస్థలే మేలన్న సీనియర్ న్యాయవాది
  • సుదీర్ఘ చర్చ అనంతరమే నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో సీబీఐ జోక్యం చేసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం ‘సమ్మతి’ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది. ప్రభుత్వ నిర్ణయంతో సీబీఐ ఇక ఏపీలో అడుగు పెట్టే అవకాశాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో ఇకపై సీబీఐ విధులను ఏసీబీనే నిర్వర్తించనుంది. చంద్రబాబు సర్కారు అనూహ్య నిర్ణయంతో ఇప్పుడీ ‘సాధారణ సమ్మతి’ ఏమిటన్న దానిపై సర్వత్ర చర్చ జరుగుతోంది.

ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-1946 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఏర్పాటు చేసింది. ఇది ఢిల్లీ పరిధిలో తన అధికారాలను వినియోగించుకోవచ్చు. ఒకవేళ బయటి రాష్ట్రాలలో దాడులు, దర్యాప్తు జరపాలనుకుంటే అక్కడి ప్రభుత్వాల అంగీకారం తప్పనిసరి. ఇందుకోసం జనరల్ కన్సెంట్ (సాధారణ సమ్మతి) నోటిఫికేషన్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ విడుదలైతేనే ఆయా రాష్ట్రాల్లో సీబీఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. లేదంటే అంతే. అయితే, ఇలా ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.

ఒకటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ నోటిఫికేషన్ ఇచ్చాయి. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన సమ్మతిని తెలియజేస్తూ వస్తోంది. చివరిసారి ఈ ఏడాది ఆగస్టులోనే సాధారణ సమ్మతి నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాజాగా, సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిందని, దాని పనితీరు మందగించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో సీబీఐ తనకు దఖలు పడిన అధికారాలను సమర్థంగా వినియోగించుకోలేకపోతోందని సీనియర్ న్యాయవాది ఒకరు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. సీబీఐతో పోలిస్తే రాష్ట్ర సంస్థలే మెరుగ్గా, ఆధునికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో జరిగే నేరాలను దర్యాప్తు చేసే సమర్థత రాష్ట్ర సంస్థలకే ఉన్నందున సీబీఐని ఆశ్రయించాల్సిన పనిలేదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో జారీ చేసిన సమ్మతి నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు.

సీనియర్ న్యాయవాది ఇచ్చిన వినతి పత్రంపై రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. రాజకీయ కక్షలతోనే ఏపీలో వరుసగా దాడులు జరుగుతున్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. దీంతో ఆగస్టులో జారీ చేసిన సమ్మతి నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

More Telugu News