air india: ఆస్తులు బేరం పెడుతున్న ఎయిరిండియా...రూ.800 కోట్లు సమీకరణ ప్రయత్నం

  • 2012లో యూపీఏ ఆమోదించిన స్థిరాస్తుల విక్రయ ప్రణాళికలో భాగం
  • గతంలో అమ్ముడుపోని ఆస్తులు కూడా వేలం
  • రూ.55వేల కోట్ల రుణభారంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ సంస్థ

అత్యధిక రుణభారంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా తన స్థిరాస్తులను అమ్మకానికి పెట్టి కొంత మొత్తం సేకరించే పనిలో పడింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా 16 నగరాల్లో ఉన్న ఆస్తులకు కంపెనీ వేలం నిర్వహించనుంది. ‘సంస్థకు చెందిన 70 ఆస్తులు అమ్మకానికి ఉంచితే దాదాపు రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్లు సమకూరుతాయని భావిస్తున్నాం’ అని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన స్థిరాస్తుల విక్రయ ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటోంది. అప్పట్లో ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళిక ప్రకారం 2014-2021 మార్చి మధ్య రూ.5 వేల కోట్లు సమీకరించాలన్నది ఎయిరిండియా లక్ష్యం. ప్రస్తుతం సంస్థకు 55 వేల కోట్ల రూపాయల అప్పుంది. గత నెలలో ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అమృతసర్‌ వంటి నగరాల్లోని 14 ఆస్తులను ఎయిరిండియా విక్రయానికి ఉంచింది. వీటిలో అమ్ముడుపోని వాటిని కూడా మళ్లీ వేలానికి ఉంచనున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.

More Telugu News