Sabarimala: కేరళ చేరుకున్న తృప్తి దేశాయ్... అనవసరపు గొడవలొద్దంటూ సలహా!

  • రేపు శబరిమలకు వెళుతున్నా
  • భద్రత కల్పించాలని కోరితే ఇంకా స్పందించ లేదన్న తృప్తి
  • నేడు తెరచుకోనున్న అయ్యప్ప దేవాలయం

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా, తాను శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటానని ఇప్పటికే ప్రకటించిన భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తి దేశాయ్, చెప్పినట్టుగానే, ఈ ఉదయం పుణె నుంచి కేరళ చేరుకున్నారు. రేపు తాను శబరిమలకు వెళ్తానని, తనకు భద్రత కల్పించాలని ఆమె, కేరళ సర్కారును కోరిన సంగతి తెలిసిందే. తన విజ్ఞప్తిపై ఇప్పటివరకూ స్పందన రాలేదని, అయినా, తన ప్రయాణం ఆగదని ఈ ఉదయం తృప్తి దేశాయ్ వ్యాఖ్యానించారు.

కాగా, తృప్తి దేశాయ్, అనవసరంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆమెను ఆలయంలోకి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని భక్త సంఘాలు స్పష్టం చేశాయి. అమెను శబరిమలకు వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెబుతున్నాయి. అనవసరపు గొడవ చేయకుండా ఆమె వెనుదిరగాలని హెచ్చరిస్తున్నాయి. నేటి సాయంత్రం ప్రధాన పూజారులకు బాధ్యతల అప్పగింత తరువాత, మండపూజ, మకరవిళక్కు సందర్భంగా సాయంత్రం 5 గంటల తరువాత ఆలయం తలుపులు తెరచుకోనున్న సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని నీలక్కల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో వేలాదిగా పోలీసులను మోహరించారు.

More Telugu News