Chandrababu: చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి రాష్ట్రంలో నో ఎంట్రీ!

  • సీబీఐ ఇక ఏపీ అవతలే
  • సమ్మతి ఉత్తర్వు వెనక్కి
  • కేంద్రానికి చెంపపెట్టే అంటున్న రాజకీయ విశ్లేషకులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఇక రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాన్ని ఎత్తివేసింది. అందుకు సంబంధించిన ‘సమ్మతి’ ఉత్తర్వును ఉపసంహరించుకుంది. ఆ సంస్థ ప్రమేయం రాష్ట్రంలో అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిజానికి ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తన అధికారులను వినియోగించుకునేందుకు సీబీఐకి ఇతర రాష్ట్రాల సమ్మతి అవసరం. ఆయా రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ (సమ్మతి) తెలిపితేనే రాష్ట్ర వ్యవహారాల్లో సీబీఐ జోక్యం చేసుకోగలదు.

అయితే, ఇటీవల గత కొంతకాలంగా సీబీఐ ప్రతిష్ఠ మసకబారుతూ వస్తుండడంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఫలితంగా సరిహద్దు దాటి ఏపీలోకి అడుగుపెట్టే అవకాశాన్ని సీబీఐ కోల్పోయినట్టు అయింది. అంటే, ఇకపై రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర రంగ ఉద్యోగులపై దాడిచేసే అవకాశం సీబీఐకి ఉండదు.

ఏపీ అనూహ్య నిర్ణయం తర్వాత ఇకపై సీబీఐ పాత్రను ఏసీబీ పోషించే అవకాశం ఉంది. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయవచ్చు.  ఆదాయపు పన్ను శాఖ, పోర్టులు, పోస్టాఫీసులు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, టెలిఫోన్‌ కార్యాలయాలు తదితర వాటిపైనా ఏసీబీ దాడుల చేయడానికి మార్గం సుగమం అయినట్టే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయ కక్షలతో సీబీఐని ఉసిగొల్పే కేంద్రానికి ఇది గుణపాఠం కాగలదని అంటున్నారు. నిజానికి కేంద్రానికి ఇది గట్టి హెచ్చరికేనని, తమ జోలికి వస్తే ఏం జరుగుతుందో చంద్రబాబు ప్రభుత్వం స్పష్టంగా చేసి చూపించిందని చెబుతున్నారు.

More Telugu News