Rahul Gandhi: టికెట్ల లొల్లి.. రాహుల్ నివాసం వద్ద బండ కార్తీకరెడ్డి నిరసన

  • సికింద్రాబాద్ నియోజకవర్గం టికెట్ నాకే ఇవ్వాలి
  • సర్వే నివేదికల్లో నా పేరే మొదటి స్థానంలో ఉంది
  • కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకురావడం తగదు

కాంగ్రెస్ పార్టీలో సీట్లు దక్కని ఆశావహులు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవకే చెందిన హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఢిల్లీలో తన నిరసన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న ఆమె, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ ఆమెతో చర్చలు జరిపినట్టు సమాచారం. కాగా, యాకత్ పురా టికెట్ ఆశిస్తున్న కీర్తి రాజేంద్రరాజు కూడా రాహుల్ నివాసం ముందు నిరసనకు దిగారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం టికెట్ తనకు ఇవ్వాలంటున్న కార్తీకరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ కోసం ముప్పై ఏళ్లుగా తన భర్త చంద్రారెడ్డి పనిచేస్తున్నారని, పార్టీని బలోపేతం చేశామని అన్నారు. సర్వే నివేదికల్లో తన పేరే మొదటి స్థానంలో ఉందని, ఇప్పుడేమో కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. మహిళలను ప్రోత్సహిస్తామని రాహుల్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. టికెట్లు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారని ప్రశ్నించిన కార్తీక, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్యారాచూట్ అభ్యర్థులకు టికెట్లు ఇస్తుండటం తగదని అన్నారు. 

More Telugu News