Sabarimala: మళ్లీ మొదలైన శబరిమల టెన్షన్... పంబకు భారీగా చేరుకుంటున్న పోలీసులు!

  • 17న తెరచుకోనున్న అయ్యప్ప ఆలయం
  • ఈ దఫా 41 రోజుల పాటు పూజలు
  • 3 వేల మంది పోలీసులతో భారీ భద్రత
  • నిరసనకారులను అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు

ఎల్లుండి మండల పూజ నిమిత్తం శబరిమలలోని అయ్యప్ప దేవాలయం తలుపులు తెరచుకోనుండటంతో భారీగా పోలీసు బలగాలు తరలివస్తున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల వారినీ అనుమతించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన తరువాత రెండుసార్లు గుడి తలుపులు తెరచుకున్న సంగతి తెలిసిందే.

తొలిసారి 5 రోజులు, ఈ నెల ప్రారంభంలో 2 రోజుల పాటు ఆలయాన్ని ప్రత్యేక పూజల నిమిత్తం తెరిచారు. అయితే, ఈ దఫా ఏకంగా 41 రోజుల పాటు దేవాలయం తలుపులు తెరవనుండటం, తమకు అయ్యప్ప దర్శనం కావాలని 'శబరిమల క్యూ' పోర్టల్ ద్వారా సమయాన్ని తెలుపుతూ 500 మందికి పైగా మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో నిరసనలు మిన్నంటుతాయన్న ఉద్దేశంతో, శబరిమల ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.

ఇందులో భాగంగా, ఈ మండల దినాల్లో నిత్యమూ 3 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. హద్దుమీరితే నిరసనకారులను అరెస్ట్ చేసి తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఇప్పటికే పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో మోహరించారు. పంబా నది నుంచి సన్నిధానం వరకూ ఉన్న ప్రాంతంలో సుమారు 1000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నామని, వీరిలో 100 మందికి పైగా 50 ఏళ్లు దాటిన మహిళా పోలీసులు ఉంటారని అధికారులు అంటున్నారు.

కాగా, ఆలయాన్ని తెరిచే 17వ తేదీనే తాను పంబకు వస్తానని, తనకు భద్రత కల్పించాలని భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించడంతో ఆమెను అడ్డుకుని తీరుతామని కేరళ హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

More Telugu News