Ponnala Lakshmaiah: పొన్నాల లక్ష్మయ్య వర్గీయుల రాజీనామా...అధిష్ఠానం తీరుపై తీవ్ర ఆగ్రహం

  • 13 మంది కౌన్సిలర్లు, 28 వేల మంది కార్యకర్తలు మూకుమ్మడిగా పార్టీకి రాంరాం
  • టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి లేఖలు
  • కాంగ్రెస్‌ రెండో జాబితాలోనూ పొన్నాల పేరు లేకపోవడంపై నిరసన

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జనగామ టికెట్‌ విషయంలో అధిష్ఠానం ఎటూ తేల్చక పోవడంతో ఆయన వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. కాంగ్రెస్‌ విడుదల చేసిన రెండో జాబితాలోనూ తమ నాయకుడి పేరు లేకపోవడంతో పొన్నాల అనుచరులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఒకేసారి 13 మంది కౌన్సిలర్లు, ఏడు మండలాలకు చెందిన 28 వేల మంది కార్యకర్తలు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. తమ రాజీనామా లేఖలను నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి పంపించారు.

తమ నేతకు టికెట్‌ రాకుండా ఓ వర్గం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తర్వాత జాబితాలోనైనా అధిష్ఠానం ఏదీ తేల్చకుంటే ఆందోళన తీవ్రమవుతుందని హెచ్చరించారు. పొన్నాలను కాదని వేరెవరికి టికెట్‌ ఇచ్చినా సహకరించేది లేదని స్పష్టం చేశారు. ‘నాలుగు దశాబ్దాలుగా జనగామకు పొన్నాలే పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. బీసీ నాయకుడని చిన్నచూపు చూస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని అనుచరులు హెచ్చరించారు.

కాగా, టికెట్‌ విషయంపై పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రెండు జాబితాల్లో పేరు లేనంత మాత్రాన టికెట్‌ రాదనుకోనక్కర్లేదని, అధిష్ఠానం జనగామ టికెట్‌ తనకే కేటాయిస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

More Telugu News