Om Prakash Chautala: కుమారుడు అజయ్ చౌతాలాపై వేటేసిన ఐఎన్ఎల్‌డీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా.. కుటుంబంలో రాజకీయ చిచ్చు!

  • ఓం ప్రకాశ్ కుటుంబంలో పెరుగుతున్న కలతలు
  • మొన్న మనవళ్లు, నేడు కుమారుడిపైనే వేటు
  • చీలిక అంచుల్లో పార్టీ

హరియాణాలో ప్రతిపక్షమైన  ఇండియన్ నేషనల్ లోక్‌దళ్  (ఐఎన్‌ఎల్‌డీ) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా కుటుంబంలో రాజకీయ కలతలు మరింత ముదిరాయి. హరియాణా మాజీ ముఖ్యమంత్రి అయిన ఓంప్రకాశ్ చౌతాలా పెద్ద కుమారుడు అజయ్ సింగ్‌ (57)ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ చీలక అంచులో ఉందన్న వార్తలు ఈ ఘటనతో మరింత బలపడ్డాయి.

రెండు వారాల క్రితమే తన ఇద్దరు మనవళ్లు, అజయ్ సింగ్ కుమారులైన హిసార్ ఎంపీ దుష్యంత్, దిగ్విజయ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఓం ప్రకాశ్ తాజాగా, కుమారుడిపైనే వేటేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలపై వీరిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించారు. అజయ్ సింగ్‌ను బహిష్కరించిన విషయాన్ని ఆయన సోదరుడు, అసెంబ్లీలో  ప్రతిపక్ష నేత అయిన అభయ్ సింగ్ చౌతాలా స్వయంగా ప్రకటించారు.

ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో తండ్రి ఓం ప్రకాశ్ చౌతాలాతో కలిసి పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న అజయ్ రెండు వారాల పెరోల్‌పై బయటకొచ్చారు. ఆ వెంటనే ఆయనను బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, తన కుమారులను బహిష్కరించడాన్ని బహిరంగంగా తప్పుబట్టిన అజయ్ సింగ్ భార్య, శాసనసభ్యురాలు అయిన నైనా చౌతాలాపై మాత్రం పార్టీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు.

More Telugu News