Cyclone: తమిళనాడు తీరం దిశగా దూసుకొస్తున్న ‘గజ’ తుపాను.. అప్రమత్తమైన నావికా దళం

  • నేటి సాయంత్రం కడలూరు వద్ద తీరం దాటనున్న తుపాను
  • యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో సిద్ధంగా ఉన్న నావికాదళం
  • అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ‘గజ’ తుపాను నేటి సాయంత్రం కడలూరు-పంబన్ మధ్య తీరం దాటనుంది. తుపాను మరింత తీవ్రతరం కావడంతో అప్రమత్తమైన తూర్పు నావికాదళం యుద్ధ నౌకలతో సిద్ధంగా ఉంది.  ఎన్ఎస్ రణ్‌వీర్, కంజర్ యుద్ధనౌకలు, హెలికాప్టర్లను సిద్ధం చేసింది. బాధితులను, అత్యవసర వస్తువులను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

కాగా, బుధవారం సాయంత్రానికి చెన్నైకి 430 కిలోమీటర్లు, నాగపట్నానికి 510 కిలోమీటర్ల దూరంలో నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణించి తీవ్ర తుపానుగా మారుతుంది. ఆ తర్వాత బలహీనపడి తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తా వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

More Telugu News