Congress: ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఎంపీలు విశ్వేశ్వరరెడ్డి, సీతారాంనాయక్ గుడ్‌బై?

  • అసంతృప్తిగా ఉన్న ఎంపీలు
  • సీనియర్ నేత చల్లా మాధవరెడ్డి కూడా
  • కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్ధం

ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు భారీ షాక్ తగలబోతోంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి గుడ్‌బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీలిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం.

 మహబూబాబాద్ ఎంపీ అయిన సీతారాం నాయక్, చేవెళ్ల ఎంపీ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా కాలంగా టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యం తనకు దక్కడం లేదని విశ్వేశ్వరరెడ్డి గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు చెక్ చెప్పి కేరళకు చెందిన ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్‌ను బరిలోకి దింపాలని పార్టీలో కుట్రలు పన్నుతున్నారని సీతారాం నాయక్ భావిస్తున్నారు. ఎంపీలిద్దరూ పార్టీ మారేందుకు కారణాలు ఇవేనని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఈసారి శాసనసభకు పోటీ చేస్తుండడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానాన్ని సీతారాంనాయక్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మరోవైపు, కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా కాంగ్రెస్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.

 తాజాగా, బుధవారం విలేకరులతో మాట్లాడిన విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్ఎస్‌ గెలుపు కష్టమేనని పేర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్ల తాను ప్రచారంలో పాల్గొనలేకపోతున్నట్టు చెప్పారు. కాగా, విశ్వేశ్వరరెడ్డితోపాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సీనియర్ నేత చల్లా మాధవరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం.  

More Telugu News