Jagan: అమెరికా నుంచి వస్తున్న శివాజీ.. రక్షణ కల్పించాలంటూ హోంమంత్రికి లేఖ

  • జగన్‌పై దాడి గురించి అప్పుడే చెప్పిన శివాజీ
  • దాడి తర్వాత బెదిరింపు ఫోన్ కాల్స్
  • రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ‘ఆపరేషన్ గరుడ’పేరుతో బీజేపీ నేతలు కుట్రకు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ గత కొన్ని రోజులుగా అమెరికాలో ఉంటున్నారు. ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేని దాడి జరగబోతోందంటూ ఆరు నెలల క్రితమే శివాజీ చెప్పుకొచ్చారు.

ఆయన చెప్పినట్టే దాడి జరగడంతో ‘ఆపరేషన్ గరుడ’ నిజమేనన్న అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. కాగా, వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్లిన శివాజీకి జగన్‌పై దాడి జరిగిన అనంతరం బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా ద్వారానూ హెచ్చరికలు చేస్తున్నారు. వైసీపీ నేత లక్ష్మీ పార్వతి బహిరంగంగానే హెచ్చరించారు.

తాజాగా, ఏపీ హోంమంత్రి చినరాజప్పకు శివాజీ అమెరికా నుంచి లేఖ రాశారు.  తాను ఈ నెల 21 ఏపీకి వస్తున్నానని, తనకు రక్షణ కల్పించాలని అందులో కోరారు. జగన్‌పై దాడి జరిగినప్పటి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. కాబట్టి, తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు.

More Telugu News