Telangana: ఖైరతాబాద్ సీటును తీసుకున్న కాంగ్రెస్.. మనస్తాపంతో ఎన్టీఆర్ భవన్ ముందు విద్యుత్ టవర్ ఎక్కిన టీడీపీ కార్యకర్త!

  • ఎన్టీఆర్ భవన్ వద్ద దీపక్ రెడ్డి అనుచరుల ఆందోళన
  • టవర్ ఎక్కిన మజ్జు అనే టీడీపీ కార్యకర్త
  • దీపక్ రెడ్డికి హామీ ఇస్తేనే దిగివస్తానని స్పష్టీకరణ

కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకటించిన రెండో జాబితాతో తెలంగాణ టీడీపీ నేతలు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా జూబ్లిహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీకి ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాటతప్పిందని మండిపడుతున్నారు. ఖైరతాబాద్ టికెట్ ను టీడీపీకి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కు కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్ కు ఎదురుగా లంకాల దీపక్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. గత 20 ఏళ్లుగా టీడీపీకి సేవ చేసిన దీపక్ రెడ్డికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వీరిలో మజ్జు అనే కార్యకర్త ఎన్టీఆర్ భవన్ ఎదురుగా ఉన్న విద్యుత్ పైలాన్ ను ఎక్కాడు. తమ నాయకుడికి కూటమి తరఫున టికెట్ కేటాయిస్తేనే కిందకు దిగివస్తానని ప్రకటించాడు. లేదంటే ప్రాణ త్యాగం చేసుకునేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశాడు. ఎవరైనా పైకి వస్తే ఇప్పుడే దూకేస్తానని హెచ్చరించాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మజ్జుతో పాటు టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ వద్ద టెన్షన్ టెన్షన్ పరిస్థితి నెలకొంది. కాగా, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ ను విష్ణువర్దన్ రెడ్డికి, ఖైరతాబాద్ టికెట్ ను దాసోజు శ్రవణ్ కు కేటాయించిన సంగతి తెలిసిందే.

More Telugu News