Chandrababu: బీజేపీ చేసిన నమ్మకద్రోహాన్ని ఇంటింటికీ తిరిగి వివరించాలి: సీఎం చంద్రబాబు

  • ఈసారి గెలిచే వారికి, ప్రజామోదం ఉన్న వారికే టికెట్లు
  • నిరంతరం ప్రజల్లో ఉండే వారికే  ప్రాధాన్యత
  • టీడీపీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో చంద్రబాబు 

బీజేపీ చేసిన నమ్మక ద్రోహాన్ని ఇంటింటికీ తిరిగి వివరించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలో టీడీపీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, ఎలక్షన్-2019 మిషన్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బీజేపీ చేసిన నమ్మక ద్రోహంపై కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.

ఎమ్మెల్యేలపై ప్రజామోదం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, ఈసారి గెలిచే వారికి, ప్రజామోదం ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తామని, నిరంతరం ప్రజల్లో ఉండే వారికే పార్టీ తరపున ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరపాలని సూచించారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉమ్మడి ధర్మపోరాట సభ

ఈ సందర్భంగా ధర్మపోరాట సభల గురించి చంద్రబాబు ప్రస్తావిస్తూ, ఈ నెల 20న నెల్లూరులో, 27న విజయనగరంలో ఈ సభలు ఉంటాయని, ఆ తర్వాత శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో నిర్వహిస్తామని చెప్పారు. చివరగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉమ్మడి ధర్మపోరాట సభను నిర్వహిస్తామని, ఈ సభకు జాతీయ పార్టీల నేతలు హాజరవుతారని తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న ‘జయహో బీసీ’ కార్యశాలను జయప్రదం చేయాలని, కార్యశాలలో వివిధ బీసీ కులాల నేతలు హాజరై చర్చించాలని సూచించారు.

More Telugu News