t-congress: పార్టీ టికెట్లను ఉత్తమ్ అమ్ముకుంటున్నారు.. ఆధారాలతో సహా బయటపెడతా: ‘కాంగ్రెస్’ రెబెల్ రాజనాల శ్రీహరి

  • నాకు టికెట్ ఇవ్వకుండా ఉత్తమ్ అడ్డుపడుతున్నారు
  • ఎవరి నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో బయటపెడతా
  • రెబెల్స్ ను బుజ్జగించేందుకు వస్తే చెప్పులతో కొడతాం

టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి రాజనాల శ్రీహరి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని నమ్ముకుని ఇరవై ఎనిమిదేళ్లుగా జెండా మోస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న తనపై ఉత్తమ్ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, తనకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉత్తమ్ టికెట్లు అమ్ముకుంటున్నారని, ఎవరి నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో ఆధారాలతో సహా నాలుగు రోజుల్లో బయటపెడతానని హెచ్చరించారు.

రౌడీలు, క్రిమినల్ కేసులున్న నాయకుల వద్ద డబ్బులు తీసుకుని పార్టీ టికెట్లు ఇస్తున్నారంటూ ఆరోపించారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ ను తొలగిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం పాటుపడుతున్న వారికి టికెట్లు ఇవ్వకుంటే ప్రతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగుతారని హెచ్చరించారు. రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వారిని బుజ్జగించేందుకు వచ్చే నాయకులను చెప్పులతో కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల ఫోరం కన్వీనర్ గా వ్యవహరిస్తానని రాజనాల పేర్కొనడం గమనార్హం.

కాగా, గ్రేటర్ వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజనాల వ్యవహరిస్తున్నారు. తనకు టికెట్ దక్కదని భావించిన ఆయన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. 

More Telugu News