Telangana: 35 సంవత్సరాలుగా ‘జనగామ’ను కాపాడుకున్న చరిత్ర నాది.. ఈ సారి కూడా టికెట్ నాకే!: పొన్నాల లక్ష్మయ్య

  • ఒకే సీటును ఖరారు చేసినట్లు స్క్రీనింగ్ కమిటీ చెప్పింది
  • కోదండరాం జనగామను కోరుకోవడం లేదన్నారు
  • మీడియాతో మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య

35 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఒకే నియోజకవర్గానికి తాను సేవలు అందించినట్లు ఉమ్మడి ఏపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. అలాంటి తనకు తొలి జాబితాలో సీటు కేటాయించకపోవడం బాధ కలిగించలేదనీ, ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తనకు తప్పనిసరిగా సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ను కలుసుకునేందుకు ఢిల్లీ చేరుకున్న పొన్నాల మీడియాతో మాట్లాడారు.

జనగామ నియోజకవర్గాన్ని 35 సంవత్సరాల పాటు కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర తనదని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. జనగామలో ఒకే అభ్యర్థి పేరును ఇచ్చినట్లు స్క్రీనింగ్ కమిటీ చీఫ్ భక్త చరణ్ దాస్ చెప్పారన్నారు. కాబట్టి తనకే జనగామ టికెట్ దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మిగతా మిత్రపక్షాలను బుజ్జగించడంలో భాగంగా జనగామ సీటుపై హైకమాండ్ సస్పెన్స్ కొనసాగిస్తోందని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంచితే, జనగామ టికెట్ ను కోరుకోవడం లేదని కోదండరాం తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు పొన్నాల పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. జనగామలో సస్పెన్స్ అధికార టీఆర్ఎస్ కు ఆయుధంగా మారుతోందని వ్యాఖ్యానించారు.

More Telugu News