Tamilnadu: ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం.. ప్రకటించిన కమలహాసన్!

  • 20 స్థానాల్లో సొంత అభ్యర్థులను నిలబెడతాం
  • సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
  • కాంగ్రెస్ తో పొత్తుపై వెనక్కి తగ్గిన నేత

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీపై దినకరన్ గ్రూపుకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిలో స్పీకర్ అనర్హత వేటు వేయగా, దాన్ని మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. దీంతో కోర్టు తీర్పును సవాలు చేయకుండా ఉపఎన్నికలకు వెళ్లాలని దినకరన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ స్పందించారు.

ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 20 స్థానాలకు(దినకరన్ గ్రూపుకు చెందిన 18 సీట్లతో పాటు మరో రెండు స్థానాలకు) తమ పార్టీ పోటీ చేస్తుందని కమల్ ప్రకటించారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు, నిస్వార్థంగా సేవలు అందించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కొత్తగా తీర్చిదిద్దాల్సిన శిల్పులు ప్రజలేనని కమల్ తెలిపారు.

విలువైన ఓటును అనాలోచితంగా వేసి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతిలో పెట్టవద్దని కోరారు. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అయితే ఇందుకోసం హస్తం పార్టీ నేతలు డీఎంకే పొత్తు నుంచి దూరం జరగాలని గతంలో కమల్ కోరారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. దీంతో చివరికి తాము ఒంటరిగానే పోటీ చేస్తామని కమల్ ప్రకటించారు.

More Telugu News