Andhra Pradesh: నాంపల్లిలో ఉన్నది గాంధీ భవనా? లేక గాంధీ ఆసుపత్రా? అన్న అనుమానం కలుగుతోంది!: మంత్రి కేటీఆర్

  • కాంగ్రెస్ నేతలు అక్కడ సెలైన్లు ఎక్కించుకుంటున్నారు
  • నేతలు తంతారన్న భయంతో అర్థరాత్రి జాబితా ప్రకటించారు
  • మహాకూటమికి ఓటేస్తే తెలంగాణ జుట్టు బాబు చేతిలోనే

టీఆర్ఎస్ తమ అభ్యర్థులను రెండు నెలల క్రితం ప్రకటిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి(మహాకూటమి) మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నేతలు ఎక్కడ కొడతారోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిన్న అర్థరాత్రి అభ్యర్థుల జాబితాను ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర రచ్చరచ్చ జరుగుతోందనీ, టికెట్లు రాని అభ్యర్థులు అక్కడే వంటావార్పు చేసుకుని ధర్నాలకు దిగుతున్నారని వెల్లడించారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన దివ్యాంగులతో ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ముందు సెలైన్లు పెట్టుకుని మరీ ఆందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పత్రికల్లో ఫొటోలు చూస్తుంటే నాంపల్లి దగ్గర ఉన్నది గాంధీ భవనా? లేదా గాంధీ ఆసుపత్రా? అన్న అనుమానం కలుగుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహాకూటమి పేరుతో కాంగ్రెస్ నేతలు తెలంగాణ జుట్టును చంద్రబాబు చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. ఈసారి మహాకూటమికి ఓటు వేస్తే మన వేలితో మన కంట్లోకి పొడుచుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరారు.

More Telugu News