Telangana: మెట్టు దిగివచ్చారు... మూడు స్థానాలతో సరిపెట్టుకున్న సీపీఐ!

  • నిన్నటి వరకూ 5 స్థానాలు కావాలని సీపీఐ పట్టు
  • మూడు ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఓకే
  • హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి సీపీఐకి

తొలుత పది స్థానాలు కావాలంటూ మహాకూటమిలో భాగమైన సీపీఐ, నిన్నటివరకూ ఐదు స్థానాలు కావాల్సిందేనని, లేకుంటే విడిపోతామని చెబుతూ వచ్చి, నేడు మెట్టుదిగింది. కాంగ్రెస్ ఆఫర్ చేసిన మూడు స్థానాలతో సరిపెట్టుకునేందుకు ముందుకు వచ్చింది. ఇదే సమయంలో సీట్ల విషయంలో అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ అలక తీర్చేందుకు కాంగ్రెస్ కూడా ఓ మెట్టు దిగి, ఎన్నికల తరువాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐ వెల్లడించిన నేతలకు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీంతో మహాకూటమిలో ఏర్పడిన లుకలుకలు, సీట్ల సర్దుబాటు దాదాపు ముగిసినట్లయింది.

తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో మహాకూటమి ఏర్పడగా, కాంగ్రెస్ నిన్న రాత్రి 65 మందితో తొలి జాబితాను ప్రకటించగానే, టీడీపీ 9 మందితో జాబితా విడుదల చేసింది. ఇక సీపీఐకి హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి విజయ పేర్లు ఖరారు కాగా, బెల్లంపల్లి నుంచి ఎవరిని బరిలోకి దింపాలన్న విషయమై ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ఈ విషయంలో నేటి సాయంత్రానికి ఓ స్పష్టత రానుండగా, ఆపై సీపీఐ తన అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News