భూరి విరాళాన్ని ప్రకటించిన వ్యక్తి... పిచ్చోడేమో పరిశీలించాలని కోర్టు ఆదేశం!

13-11-2018 Tue 12:32
  • భారీ డ్యామ్ నిర్మాణాన్ని తలపెట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపు
  • యావదాస్తినీ ఇచ్చేసిన వ్యక్తి, స్పందించిన కోర్టు

ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఓ భారీ డ్యామ్ నిర్మాణం కోసం తన యావదాస్తినీ విరాళంగా ఓ వ్యక్తి ప్రకటించగా, అతని మానసిక స్థితి ఎలా ఉందో పరిశీలించాలని న్యాయస్థానం ఆదేశించిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పాకిస్థాన్ దేశ నీటి అవసరాలు తీర్చేందుకు ఓ భారీ రిజర్వాయర్ ను నిర్మించ తలపెట్టిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రజల నుంచి, విదేశాల్లో నివసిస్తున్న పాక్ వాసుల నుంచి విరాళాలు కోరారు.

దీనిపై స్పందించిన షేక్ షాహిద్ అనే వ్యక్తి, తనకున్న రూ. 8 కోట్ల విలువైన ఆస్తిని విరాళంగా ఇచ్చాడు. అతని నిర్ణయాన్ని వ్యతిరేకించిన భార్య కోర్టుకు ఎక్కింది. తన భర్తకు మానసిక వ్యాధి ఉందని ఆరోపించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, షరియా చట్టాల ప్రకారం, వారసుల అనుమతి లేకుండా విరాళాలు ఇవ్వడం చెల్లదని చెబుతూ, అతని మానసిక స్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని వైద్యులను ఆదేశించింది.