Telangana: కాంగ్రెస్ టికెట్ల ఎఫెక్ట్.. 17న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు!

  • బీసీలకు 13 టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్
  • అన్యాయం చేసిందన్న ఆర్.కృష్ణయ్య
  • 4 శాతం రెడ్లకు 23 టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసిందని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. మొత్తం 65 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, వీరిలో 13 మంది మాత్రమే బీసీలు ఉన్నారని అన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 23 మంది రెడ్డి సామాజికవర్గం నేతలే ఉన్నారని పేర్కొన్నారు.

బీసీలకు అన్యాయం చేసినందుకు నిరసనగా ఈ నెల 17న తెలంగాణ బంద్ చేపట్టనున్నట్లు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. కనీసం బీసీలకు 25 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం జనాభాలో 4 శాతంగా ఉన్న రెడ్లకు 23 సీట్లు ఇవ్వడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాధికారం దక్కినప్పుడే బీసీ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. బీసీ సామాజికవర్గం నేతలందరూ ఈ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.నిన్న అర్థరాత్రి కాంగ్రెస్ పార్టీ 65 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

వీరిలో 23 మంది రెడ్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 39 మంది ఉన్నారు. అలాగే వెలమ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు, ఐదుగురు మున్నూరు కాపులు, నలుగురు గౌడ్ లు, బ్రాహ్మణ, పద్మశాలీ, యాదవ కులాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఈ జాబితాలో 10 మంది మహిళలకు చోటు దక్కింది.

More Telugu News