Bangladesh: వచ్చే నెలలో బంగ్లాదేశ్ ఎన్నికలు.. బరిలోకి వన్డే కెప్టెన్ మోర్తాజా

  • వచ్చే నెలలో బంగ్లాదేశ్ ఎన్నికలు
  • అవామీ లీగ్ తరపున బరిలోకి
  • స్వయంగా ప్రకటించిన ప్రధాని హసీనా

క్రీడాకారులు రాజకీయాల్లోకి రావడం కొత్తకాదు. అయితే, రిటైర్మెంట్ తర్వాతో, ఇంకెప్పుడో చాలామంది రాజకీయాల్లో అడుగుపెడుతుంటారు. అయితే, విచిత్రంగా సూపర్ ఫామ్‌లో ఉన్న బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ ముష్రఫె మోర్తాజా (35) వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా సోమవారం ప్రకటించారు. క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న బంగ్లాదేశ్‌లో మోర్తాజాకు రాక్‌స్టార్‌గా గుర్తింపు ఉంది.

అధికార అవామీ లీగ్ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలన్న మోర్తాజా నిర్ణయానికి హసీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. సొంత జిల్లా అయిన పశ్చిమ బంగ్లాదేశ్‌లోని నరైలీ నుంచి పోటీ చేయాలని మోర్తాజా భావిస్తున్నట్టు అవామీ లీగ్ అధికార ప్రతినిధి మహబూబుల్ అలం హనీఫ్ తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లాలన్న క్రికెటర్ల ప్రయత్నాన్ని అడ్డుకోబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.

అటు రాజకీయాలు, ఇటు కెరీర్‌ను మోర్తాజా బ్యాలెన్స్ చేసుకోగలడని తాము విశ్వసిస్తున్నట్టు బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనుస్ తెలిపారు. కాగా, 2019 ప్రపంచకప్ తర్వాత మోర్తాజా క్రికెట్‌ నుంచి రిటైర్ కానున్నట్టు ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. కొందరు అభిమానులు మోర్తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News