bjp: బీజేపీకి 2014లో ఉన్న హవా ఇప్పుడు లేదు.. చివరి 10 నుంచి 12 రోజులే కీలకం: ప్రశాంత్ కిషోర్

  • మోదీ తిరుగులేని నేత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు
  • ఈ ఎన్నికల్లో బీజేపీకి 272 సీట్లు రావడం కష్టం
  • పేదవారు ఎవరికి ఓటు వేస్తారో ఊహించలేము

2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ తిరుగులేని మెజార్టీతో అధికార పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అధికారానికి అవసరమైన సీట్లను బీజేపీ సొంతంగానే గెలుచుకుంది. ఈ విజయంలో జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్ (జగన్ కు సలహాదారుడిగా కూడా వ్యవహరించారు) పాత్ర కూడా చాలా కీలకమైనది. రాజకీయ వ్యూహకర్తగా మంచి పేరున్న పీకే... ఆ ఎన్నికల్లో బీజేపీకి సలహాదారుడిగా వ్యవహరించారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

2014లో ఉన్న పరిస్థితి ఇప్పుడు బీజేపీకి లేదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ తిరుగులేని నేత అని చెప్పడంలో అతిశయోక్తి లేదని... కానీ, ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో మాదిరి బీజేపీ సత్తా చాటలేదని అన్నారు. గత ఎన్నికల్లో కన్నా మెజార్టీ తక్కువ రానున్నప్పటికీ... బీజేపీనే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు.  

బీహార్ కు సేవ చేయాలనే ఉద్దేశంతోనే... ఇతర రాజకీయ పార్టీలకు సలహాదారుడిగా పని చేయడం మానేసి, జేడీయూలో చేరానని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. జేడీయూ చిన్న పార్టీనే అయినా... ఆ పార్టీకి ఎలాంటి మచ్చ లేకపోవడం తనను ఆకర్షించిందని చెప్పారు. తాను కాంగ్రెస్, బీజేపీలతో కలసి పని చేశానని... రాజకీయాల్లో రాణించడం కఠినమైన విషయమని అన్నారు.

జేడీయూ నేతల సగటు వయసు 45 ఏళ్లకు తీసుకు వచ్చే లక్ష్యంతో పని చేస్తున్నానని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వేసే అంచనాలన్నీ తారుమారవుతాయని... చివరి 10 నుంచి 12 రోజులే అత్యంత కీలకమని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారమని... అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి 272 సీట్లు రావడం కష్టమేనని చెప్పారు.

ప్రతిపక్షం బలమైనదా, కాదా? అనే దానికన్నా ఇతర అంశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని పీకే తెలిపారు. పేదవారు ఎవరికి ఓటు వేస్తారో చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 2014లో 4 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉంటే... ఇప్పుడు 40 కోట్లు ఉన్నాయని అన్నారు.

More Telugu News