Bandaru Dattatreya: డిగ్రీ చదివే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు: దత్తాత్రేయ

  • రూ.10 వేల కోట్లతో రైతు నిధి
  • బీసీలను టీఆర్ఎస్ మోసగించింది
  • చంద్రబాబు తీరు హాస్యాస్పదం
  • మహాకూటమి వల్ల బీజేపీకే మేలు

అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేస్తామని, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అన్నారు. నేడు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్ని రకాలను ఉచితంగా అందజేస్తామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రూ.10 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. డిగ్రీ చదివే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తామన్నారు.

నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనపై దత్తాత్రేయ ధ్వజమెత్తారు. మౌలిక వసతులను మెరుగుపరచలేదని, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద సీట్లు తమవే అని ప్రచారం చేయడానికి కారణం ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికేనన్నారు. బీసీలకు రూ.లక్ష కోట్లు నిధులను కేటాయిస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మోసగించిందని దత్తాత్రేయ మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు చంద్రబాబు యత్నిస్తున్న తీరు హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని ఆ పార్టీకే తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహాకూటమి వల్ల బీజేపీకే మేలు జరుగుతుందని.. 2019లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News