Telangana: పార్టీలో సీనియర్ నేతను.. నేనే టికెట్ కోసం దిక్కులు చూడాల్సి వస్తోంది!: కాంగ్రెస్ నేత వనమా ఆవేదన

  • బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోంది
  • సీపీఐకి కొత్తగూడెం టికెట్ ఇవ్వొద్దు
  • నాకు టికెట్ ఇస్తే 30వేల మెజారిటీ తెస్తా

మహాకూటమి, పొత్తుల పేరుతో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని సీనియర్ నేత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న తాను కూడా టికెట్ కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐకి కొత్తగూడెం టికెట్ ను కేటాయిస్తే అధికార టీఆర్ఎస్ సునాయాసంగా విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వనమా వెంకటేశ్వరరావు మాట్లాడారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అధికార టీఆర్ఎస్ తో లాలూచీపడి ఐదో స్థానంలో నిలిచారని వనమా ఆరోపించారు. ఆయనకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తుచేశారు. అలాంటి నేతకు మహాకూటమి తరఫున కొత్తగూడెం సీటును ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు 80 శాతం ఉన్నట్లు సర్వేల్లో తేలిందన్నారు.

ఈ ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ ఇస్తే 30,000 ఓట్ల మెజారిటీతో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీసీలకు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ లో ఓ సీటును కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.

More Telugu News