TRS: టీఆర్ఎస్ లో చేరిన హైదరాబాదీ గుజరాతీలు.. సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్!

  • పేద గుజరాతీలకు సంక్షేమ పథకాలపై వివక్ష ఉండదు
  • కేసీఆర్ హయాంలోనే శాంతిభద్రతలు మెరుగయ్యాయి
  • పెట్టుబడులు పెట్టే వారు లాభాలతో పాటు శాంతిభద్రతలూ చూస్తారు

హైదరాబాద్ నగరానికి చెందిన గుజరాతీలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. వీరిని కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో నివసిస్తున్న పేద గుజరాతీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ హయాంలోనే హైదరాబాద్ లో శాంతిభద్రతలు మెరుగయ్యాయని, సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ తో పాటు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు.

గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణను గుజరాతీలు గుర్తించాలని సూచించారు. పెట్టుబడులు పెట్టే వారు లాభాలతో పాటు శాంతిభద్రతలు కూడా చూస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో అవినీతి పూర్తిస్థాయిలో తగ్గిందని, సులభతర వాణిజ్యంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని అన్నారు.

 గడిచిన నాలుగేళ్లలో హైదరాబాద్ లో నాలుగు నిమిషాల కర్ఫ్యూ కూడా విధంచలేదని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని చెప్పారు. భవిష్యత్ లో కూడా హైదరాబాద్ లో మంచినీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకున్నామని, దేశానికే గర్వకారణంగా  పోలీస్ కమాండ్ కంట్రల్ సెంటర్ నిలవబోతోందని కేటీఆర్ అన్నారు. 

More Telugu News