India: అమిత్ షా అన్నది భారతీయుల పేరే కాదు.. ముందుగా దాన్ని మార్చాలి!: చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్

  • గుజరాత్ అని పిలవడం కూడా సరికాదు
  • దేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తున్నారు
  • బీజేపీపై చరిత్రకారుడు హబీబ్ ధ్వజం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రముఖ నగరాలు, వీధుల పేర్లను ఇష్టానుసారంగా మార్చడంపై ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ తీవ్రంగా స్పందించారు. ఆదిత్యనాథ్ ఎలాంటి లాజిక్ లేకుండా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడైనా చారిత్రక అంశాలు, ప్రాధాన్యత ఆధారంగా పేర్లను మారుస్తారనీ, కానీ ఇక్కడ మాత్రం భారత్ ను హిందుత్వ దేశంగా మార్చే కుట్రలో భాగంగా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు.

స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్ చేసిన తప్పునే ఇప్పుడు యూపీ ప్రభుత్వం చేస్తోందని హబీబ్ అభిప్రాయపడ్డారు. దేశవిభజన తర్వాత ఇస్లామిక్ గా అనిపించని నగరాలు, ప్రాంతాల పేర్లను పాక్ ప్రభుత్వం మార్చేసిందని హబీబ్ గుర్తుచేశారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేరులోని ‘షా’ అనే ఇంటిపేరు అసలు గుజరాతీయే కాదని హబీబ్ స్పష్టం చేశారు.

అది పర్షియన్(ఇరాన్) పేరు అని వ్యాఖ్యానించారు. కాబట్టి నిజంగా హిందుత్వ పేర్లను పెట్టాలనుకుంటే ముందుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును మార్చాలని చురకలు అంటించారు. ఆగ్రా పేరును అగ్రావన్ గా మార్చాలని బీజేపీ నేత జగన్ ప్రసాద్ డిమాండ్ చేయడంపై స్పందిస్తూ.. అగ్రాను పాలించినట్లు చెబుతున్న అగ్రసేన్ కల్పితమని వ్యాఖ్యానించారు.

అగర్వాల్ సామాజిక వర్గం హరియాణాకు చెందినవారనీ, వారికి ఆగ్రాతో సంబంధమే లేదని స్పష్టం చేశారు. పక్కాగా చెప్పుకుంటే అసలు గుజరాత్ ను గుజరాత్ అని పిలవడమే సరికాదని హబీబ్ అన్నారు. గుజరాత్ అన్నది పర్షియన్ పదమనీ, వాస్తవానికి దాన్ని గుర్జరాట్రగా పిలవాల్సి ఉంటుందని సమాధామిచ్చారు.

More Telugu News