YSRCP: చిన్న కత్తేగా?... గాయం ఎంత వెడల్పు, లోతు అని అడుగుతారా?: నిప్పులు చెరిగిన విజయమ్మ

  • ఏడాదిగా ప్రజల్లోనే జగన్
  • హత్యాయత్నంపై ప్రభుత్వ తీరు గర్హనీయం
  • ఘటన వెనకున్న వారి పేర్లు రానీయలేదు
  • వైఎస్ విజయమ్మ ఆరోపణలు

గడచిన ఏడాది కాలంలో వైఎస్ జగన్, తన కుటుంబ సభ్యుల మధ్య కన్నా, ప్రజల్లోనే ఎక్కువగా ఉన్నారని, అటువంటి వ్యక్తిపై హత్యాయత్నం జరిగితే, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏ మాత్రం హర్షణీయం కాదని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. హత్యాయత్నం తరువాత, కత్తి చిన్నదేగా? గాయం ఎంత వెడల్పున ఉంది? లోతెంత? దాడి చేసింది వైకాపా కార్యకర్తే. జగన్ కు ప్రజల్లో సానుభూతి కోసం ఈ పని చేశాడు... అంటూ టీడీపీ నేతలు, డీజీపీ వ్యాఖ్యానించడాన్ని విజయమ్మ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లు ఒకే మాటపై నిలబడి, రోజుకో మాట, పూటకో సాక్ష్యం చూపిస్తూ ప్రజలను మభ్య పెట్టారని, ఘటన వెనకున్న వారి పేర్లు మాత్రం ఇంతవరకూ బయటకు రాలేదని మండిపడ్డారు.

"నేడు అడుగుతున్నా. ఎయిర్ పోర్టులో, వీఐపీ లాంజ్ లో సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ సెక్యూరిటీ? అని నేను అడుగుతున్నా. ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ లేకపోతే, ఈ ప్రభుత్వం ఇంక ఎవరికి సెక్యూరిటీ ఇస్తుందని అడుగుతున్నా. ఈరోజు ఎయిర్ పోర్టులోకి గుండుసూది కూడా పోలేదు. నెయిల్ కట్టర్లు, చిన్న కత్తెరలు ఉన్నా తీసేస్తారు. అటువంటిది ఏ విధంగా కత్తి వెళ్లింది. ఎవరు సహాయం చేశారు? ఎవరి ప్రోద్బలంతో కత్తి వెళ్లింది? దాని గురించి ఎంక్వయిరీ లేనే లేదు" అని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు రావడం ఏంటని ప్రశ్నించారు. విచారించకుండానే అలా ఎలా మాట్లాడారని అడిగారు.

More Telugu News