ఖైరతాబాద్ దానం నాగేందర్ కు... టీఆర్ఎస్ పెండింగ్ స్థానాలకు అభ్యర్థులు వీరే!

11-11-2018 Sun 06:59
  • తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు
  • ఇప్పటికే 107 మందిని ప్రకటించిన కేసీఆర్
  • నేడో, రేపో మిగతా అభ్యర్థుల వివరాలు వెల్లడి
రెండు నెలల క్రితం ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామని స్పష్టం చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సెప్టెంబర్ 6న 105 మంది అభ్యర్థుల వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలుండగా, 12 సీట్లలో ఎవరినీ ప్రకటించలేదు.

ఇటీవల జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి కే మాణిక్‌ రావును, మలక్‌ పేట్‌ అసెంబ్లీ స్థానానికి చెవ్వా సతీష్‌ లను ఆయన ఖరారు చేయగా, మిగతా వారి పేర్లను కూడా ఆయన ఆమోదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇలా ఉండనుంది.

ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్, గోషామహల్‌ నుంచి ప్రేమ్‌ సింగ్‌ రాథోడ్, ముషీరాబాద్‌ నుంచి ముఠా గోపాల్, అంబర్‌పేట నుంచి కాలేరు వెంకటేశ్, మేడ్చల్‌ నుంచి సీహెచ్ మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండి నుంచి సుంకె రవిశంకర్, వరంగల్‌ తూర్పు నుంచి నన్నపనేని నరేందర్, హుజూర్‌ నగర్‌ నుంచి శానంపూడి సైదిరెడ్డి లేదా అప్పిరెడ్డి, కోదాడ నుంచి వేనేపల్లి చందర్‌రావు లేదా కే శశిధర్‌ రెడ్డి, వికారాబాద్‌ నుంచి టీ విజయ్‌ కుమార్‌ లేదా ఎస్‌ ఆనంద్, చార్మినార్‌ నుంచి దీపాంకర్‌ పాల్‌ లేదా ఇలియాస్‌ ఖురేషీలను కేసీఆర్ నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.