ashok gehlot: 40 ఏళ్లు కాంగ్రెస్ తో విభేదించాం.. ఇప్పుడు చేతులు కలపడానికి కారణం ఇదే: చంద్రబాబు

  • మోదీ, అమిత్ షాలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
  • సొంత వ్యక్తుల కోసం నిబంధనలను కూడా మార్చుతున్నారు
  • కీలక వ్యవస్థలను నాశనం చేస్తున్నారు
  • తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మహాకూటమి చాలా అవసరం
  • బాధ్యత కలిగిన అన్ని పార్టీలు కూటమిలో కలవాలి

ప్రధాని మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. ఎవరు ఏది చెప్పినా మోదీ వినరని... ఏది అనుకుంటే అది చేస్తారని విమర్శించారు. మోదీ, అమిత్ షా ఇద్దరూ కలసి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని కీలక వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నారని అన్నారు. తమ సొంత వ్యక్తుల కోసం నిబంధనలను కూడా మార్చుతున్నారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో జరుగుతున్న పరిణామాలను ప్రతి ఒక్క పౌరుడు గమనిస్తున్నారని అన్నారు. అమరావతిలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, చంద్రబాబులు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశంలోని పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అని... గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలతో విభేదించిన టీడీపీ... ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఆ పార్టీతో చేతులు కలిపిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మహాకూటమి చాలా అవసరమని అన్నారు. ఇప్పటికే కొన్ని పార్టీల అధినేతలతో మాట్లాడానని... త్వరలోనే ఇతర పార్టీల నేతలను కూడా కలుస్తానని చెప్పారు.

దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన ప్రతి పార్టీ మహాకూటమి గురించి ఆలోచించాలని కోరారు. నేతలలో సమావేశాలు పూర్తయిన తర్వాత ఢిల్లీలో అన్ని పార్టీలతో కలసి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలిపారు. అశోక్ గెహ్లాట్ తో జాతీయ రాజకీయాలు, జాతీయ అజెండాపై చర్చించానని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి అజెండాను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విషయంపై ఇద్దరం చర్చించామని చెప్పారు. 

More Telugu News