Andhra Pradesh: నాకు డబ్బు ఆఫర్ చేసేంత ధైర్యం జగన్ కు లేదు!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

  • జగన్, గాలి కేసుల విచారణలో ఒత్తిడి లేదు
  • సీబీఐ విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయి
  • రాజకీయ పార్టీపై త్వరలోనే క్లారిటీ

ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తే పరిస్థితి నెలకొందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి లపై నమోదయిన కేసులను విచారించేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదని వెల్లడించారు. ఈ రెండు కేసుల విచారణతో తన ఇమేజ్ అమాంతం పెరిగిందని వ్యాఖ్యానించారు. తన అసలు పేరు వీవీ లక్ష్మీ నారాయణ కన్నా జేడీ లక్ష్మీ నారాయణగానే తాను ఎక్కువ ఫేమస్ అయ్యానని పేర్కొన్నారు.

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ మాట్లాడుతూ.. రహస్యంగా బెయిల్ కోసం తనకు డబ్బు ఆఫర్ చేసేంత ధైర్యం జగన్, గాలి జనార్ధనరెడ్డికి లేదని లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయాలతో ముడిపడిఉన్న ఈ కేసుల విచారణ సందర్భంగా తనకు ఎలాంటి ఇబ్బందులు రాలేదనీ, ఒకవేళ ఒత్తిడి వచ్చినా తప్పుకునేవాడిని కాదని తెలిపారు. కోర్టుల్లో సీబీఐ దాఖలు చేస్తున్న కేసులు వీగిపోవడం, అంతర్గత కుమ్ములాటలు చూస్తుంటే సంస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు.

తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు చెప్పాగానే చాలామంది.. ‘ఎందుకయ్య బురదలోకి దిగుతావు?’ అని ప్రశ్నించినట్లు జేడీ తెలిపారు. దీంతో తాను స్పందిస్తూ..‘మనం బురద అని  దిగకుంటే ఆ బురద ఇంకా కంపు కొడుతుంది. మంచివాళ్ల మౌనం దేశానికి ప్రమాదకరం. మంచి చేయాలన్న తపన ఉంది. ఓపిక ఉంది. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా’ అని జవాబిచ్చినట్లు వెల్లడించారు. భావ సారూప్యమున్న వాళ్లతో తాను కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని లక్ష్మీ నారాయణ తెలిపారు. త్వరలోనే తన రాజకీయ పార్టీపై క్లారిటీ ఇస్తానని చెప్పారు.

More Telugu News