Andhra Pradesh: ఆర్టీసీ కండక్టర్ స్థాయి నుంచి బాలరాజు మూడుసార్లు మంత్రి అయ్యారు!: పవన్ కల్యాణ్

  • గిరిజనుల సంక్షేమానికి పాటుపడ్డారు
  • వైఎస్ హయాంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నారు.
  • జనసేనలో చేరిన బాలరాజు

భావితరాలకు అండగా ఉండాలన్న ఆశయంతోనే జనసేన పార్టీని స్థాపించానని పవన్ కల్యాణ్ తెలిపారు. తాము రాజకీయ పార్టీని పెట్టినప్పుడు ఎలాంటి అనుభవం లేని సామాన్యులే పార్టీలో ఉన్నారని వెల్లడించారు. 2014లో ఏపీ విభజన తర్వాత పోటీ చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీకి మద్దతు ఇచ్చామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేత పసుపులేటి బాలరాజు ఈ రోజు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు.

మన ఆశయాలు మంచిగా ఉంటే నాయకులు తమంతటా తామే వస్తారని తాను విశ్వసిస్తానని పవన్ తెలిపారు. అందువల్లే భావసారూప్యత ఉన్న నాదెండ్ల మనోహర్, బాలరాజు జనసేనలో చేరారని వెల్లడించారు. ఓ ఆర్టీసీ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన బాలరాజు మూడు సార్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు.

వైఎస్ హయాంలో మైనింగ్ ఉద్ధృతంగా సాగుతున్న వేళ.. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను బాలరాజు గట్టిగా వ్యతిరేకించి అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో బాలరాజు చాలా గట్టిగా నిలబడ్డారని వ్యాఖ్యానించారు. ఇక నాదెండ్ల మనోహర్ అయితే ఓ స్పీకర్ గా చాలామంది ప్రజాప్రతినిధులు అరకు ప్రాంతానికి తీసుకెళ్లి వాస్తవ పరిస్థితులను చూపారన్నారు. టీడీపీ ఎంత ఒత్తిడి చేసినా లొంగకుండా గిరిజన ప్రజలకు అండగా బాలరాజు నిలబడ్డారని కితాబిచ్చారు.

More Telugu News