laloo prasad yadav: కుటుంబ సమస్యల కారణంగా లాలూ ప్రసాద్ సరిగా నిద్రపోవడం లేదు: డాక్టర్ ఝా

  • విడాకులకు దరఖాస్తు చేసిన లాలూ పెద్ద కుమారుడు
  • విడాకులు వద్దంటూ వారించిన లాలూ
  • మాట వినని తేజ్ ప్రతాప్

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబ సమస్యలతో సరిగా నిద్రపోవడం లేదు. దాణా కుంభకోణం కేసులో ఆయన ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. రకరకాల అనారోగ్య కారణాలతో జార్ఖండ్ లోని రిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ డీకే ఝా మాట్లాడుతూ, కుటుంబ సమస్యలతో లాలూ సరిగా నిద్రపోవడం లేదని చెప్పారు. ప్రతిరోజు 14 నుంచి 15 రకాల మందులను ఆయన తీసుకుంటున్నారని చెప్పారు. 70 ఏళ్ల వయసున్న ఆయనకు టెన్షన్, ఒత్తిడి మంచిది కాదని తెలిపారు.

సరిగా నిద్రపోకపోవడం ఆయన ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తుందని చెప్పారు. మధుమేహం, కిడ్నీ సమస్యల వంటి రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు. మధుమేహానికి సంబంధించి ఆయనకు ప్రతి రోజూ ఎక్కువ డోసులో ఇన్సులిన్ ఇస్తున్నామని చెప్పారు.

రాత్రిపూట లాలూ చాలా సేపు నిద్రపోకుండా ఉంటున్నారని డాక్టర్ ఝా తెలిపారు. కుటుంబ సమస్యలతో ఆయన సతమతమవుతున్నారని చెప్పారు. షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో లాలూకు గత మూడు రోజులుగా ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ విడాకులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అదే రోజు తన తండ్రిని ఆయన కలిశారు. దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ విడాకుల విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా విడాకులు తీసుకోవద్దని తన కుమారుడిని ఒప్పించే ప్రయత్నాన్ని లాలూ చేశారు.

అయినప్పటికీ, తేజ్ ప్రతాప్ తన తండ్రి మాట వినకుండా... విడాకుల విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ పరిణామాలన్నీ లాలూకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. 

More Telugu News