Andhra Pradesh: సీఎం రమేశ్ ‘బూతు రమేశ్’ గా ఫేమస్ అయ్యారు.. లోకేశ్ పరువును టీడీపీ నేతలే తీస్తున్నారు!: బీజేపీ నేత జీవీఎల్ ఫైర్

  • సవాళ్లు విసిరి పారిపోతున్నారు
  • ఇంత పిరికి పందలైతే ఎలా?
  • చచ్చు రాజకీయాలు చేయకండి

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం చెత్త రాజకీయాలు చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. చర్చల పేరుతో బీజేపీ నేతలకు సవాల్ విసురుతున్న టీడీపీ నేతలు తాము రంగంలోకి దిగగానే పోలీసుల రక్షణతో పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇంత పిరికి పందలైతే రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుందని ప్రశ్నించారు.

తమ నేతలు పైడికొండల మాణిక్యాలరావు, విష్ణువర్ధన్ రెడ్డిలను చర్చలకు రావాలంటూ పిలిచిన టీడీపీ నేతలు చివరికి అక్కడి నుంచి పారిపోయారని వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఏపీలో అభివృద్ధిపై చర్చకు రావాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తనకు సవాల్ విసిరారనీ, తాను ఓకే చెప్పగానే పారిపోయారని జీవీఎల్ తెలిపారు. ఇక సీఎం రమేశ్ అయితే చర్చల సందర్భంగా బండబూతులు తిట్టి రాష్ట్రమంతటా బూతుల రమేశ్ గా ఫేమస్ అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చర్చలో కూర్చునే ఓపిక, సత్తా టీడీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు కొడుకు కాకుండా మంత్రి లోకేశ్ కు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలే లోకేశ్ పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ చర్చలకు సిద్ధంగా ఉంటుందనీ, కానీ చచ్చు సవాళ్లు విసిరి పారిపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. నిన్న తాడేపల్లిగూడెంలో బీజేపీ నేత మాణిక్యాల రావును పరామర్శించేందుకు 4 కార్లలో వెళుతున్న తమను అడ్డుకున్నారని వెల్లడించారు.

ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రజాస్వామ్యంపై పాఠాలు చెబుతారనీ, ఏపీలో మాత్రం పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ చేసే అప్రజాస్వామిక పనులను ప్రజల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్నవన్నీ దుర్మార్గపు పనులనీ, వీటిని మానుకోవాలని హితవు పలికారు.

More Telugu News